అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి

ఈ చిత్రమ్ పేరు వినగానే చాలా మందికి మదిలో పాత జ్ఞాపకాలు కదులుతాయి. అవునంటారా కాదంటారా ? నేనైతే అవుననే అంటాను, ఇంతకీ అదేమిటో గుర్తొచ్చిందా, అదేనండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం. సినీ చరిత్రలో 25 కార్లు, చేతులపై నడిపించుకుని మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులందరి దృష్టిని తిప్పుకున్న "అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి" చిత్రం.
కాకపోతే దీనికి ఆ పాత చిత్రానికి, పేరులో తప్ప వేరే ఎటువంటి సారూప్యత లేదులెండి. "30 రోజుల్లో ప్రేమించటం ఎలా" అనే పేరుతో మొదలు పెట్టిన ప్రదీప్ మాచిరాజు రెండవ చిత్రంగా తన సహ వ్యాఖ్యాత దీపికా పిల్లి తో కలిసి చేసిన చిత్రమే ఈ "అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి".
కథా కమామీషు
దీపికా పిల్లి కధా నాయికగా చిత్ర అరంగేట్రం చేసిన ఈ చిత్రం కధలో ప్రధాన పాత్ర ఉన్నప్పటికీ ప్రదీప్ మాచిరాజునే డామినేట్ చేసినట్టు ఉంటుంది. ఓ రియల్ ఎస్టేట్ నిర్మాణ వ్యాపార సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తున్న ప్రదీప్ వాళ్ళ సంస్థ చేసే పనిమీద ఓ పల్లెటూరు వస్తాడు. కట్టు బాట్లుతో సాధారణ సమాజానికి కాస్త దూరంగానే ఉన్న ఆ వూరిలో ఒకే ఒక్క ఆడపిల్ల ఈ రాజకుమారి అనే దీపికా. ఊరు మొత్తం మగ పిల్లల సంతానంతో ఉండి, పూర్తి కరువు కాటకాలతో ఉన్న ఆ వూరికి అదృష్టంగా పుట్టిన ఒకే ఒక్క ఆడపిల్ల అవటంతో ఊరి పెద్దతో సహా అందరు తనని గౌరవించటం, ఆమె ఊరు దాటితే మళ్ళి కరువు వస్తుందనే మూఢ నమ్మకంతో తండ్రి దగ్గర ఆ అమ్మాయి వూరు దాటకూడదని, పెళ్లి కూడా అదే ఊరిలోని వాళ్ళని చేసుకోవాలి అనే మాట తీసుకొంటాడు ఆ వూరి పెద్ద. పెరిగి పెద్దయిన తర్వాత ఈ రాజకుమారి ప్రదీప్ ని ఎలా పెళ్లి చేసుకుంటుంది, ఆ 60 మంది మగపిల్లలు ఏమి చేసారు అనేది సినిమా పూర్తి కధ.
విశ్లేషణ:
బుల్లితెర పైన సరదాగా నవ్వుతు పంచ్ లతో కుప్పి గంతులతో అందర్నీ ఆకట్టుకునే ప్రదీప్ అదే భావ ప్రకటనతో వెండితెర పైన కూడా హాస్యం పంచుతున్నారు. ఈ చిత్రంలో హాస్య నటుడైన వెన్నెల కిశోర్ ఉన్నప్పటికీ అంత పెద్దగా అతని హాస్యం పండలేదు. చిత్రం మొత్తం ప్రదీప్, సత్యనే ఆడి పాడి అలరించారు. గెటప్ శ్రీను పాత్ర కూడా తగినట్లుగానే ఉంది. దీపికా నటన పరవాలేదు అనిపించినా, అందం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రేమికుల మధ్య ప్రేమ భావాలకు పెద్దపీట వేయని నాయికా-నాయికల సన్నివేశాలు. పాటలు, సంగీతం ఓ మోస్తరుగ అనిపించాయి. ఆసాంతం నవ్వులకే ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉంటుంది. మిగిలిన సహాయ నటులు ఎవరి పరిధి మేరకు వాళ్ళు నటించారు. ఎంచుకున్న కధని మొత్తం పకడ్బందీగానే మలుచుకుని అన్నిటిని కలుపుతూ చిత్రానికి సన్నివేశాలకు న్యాయం చేశారు దర్శకులు నితిన్-భరత్.

ఆస్తులు
అశ్లీలత లేని పూర్తి హాస్యం, ప్రదీప్, సత్య, గెటప్ శ్రీనుల సన్నివేశాలు, నటన. బుల్లితెరకి వెండితెరకి విభిన్నమైన దీపికా ఆహార్యం, అక్కడక్కడా గ్రామ అందాలను, నాయికా నాయికల మధ్య ప్రేమ తెలిపే ఓ సన్నివేశంలో వాడుకున్న ప్రదీప్ మాచిరాజు సృజనాత్మకత
కుదుపులు
ద్వితీయార్ధంలో ఉన్న సాగతీత కధనం, హబ్బా అనిపించే సంగీతం పూర్తిగా లేకపోవడం, ప్రేమని పలకరించి పండించే రసవత్తరమైన భావోద్వేగ సన్నివేశాల లోటు , కొత్తగా వచ్చే ప్రేక్షకుడుని ఆకట్టుకోలేని నాయికా నాయికల హావభావాలు.

నటీనటులు : దీపికా పిల్లి, ప్రదీప్ మాచిరాజు, వెన్నెల కిశోర్, మురళి గౌడ్, రోహిణి, సత్య, ఝాన్సీ తదితర నటులు
దర్శకులు : నితిన్- భరత్
సంగీతం : రథన్
నిర్మాత : మాంక్స్ అండ్ మంకీస్
ఎడిటర్ : కొడటి పవన్ కళ్యాణ్
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.