Kadhalikka Neramillai

కాదలిక్క-నేరమిల్లై (నెట్ ఫ్లిక్స్)

ప్రేమకు సమయం లేదు

ప్రేమకు సమయం లేదు - ద్వంద్వార్థం ఏమిలేదు ప్రేమించబడటానికి ప్రేమించటానికి సమయంతో పనిలేదు అనే సారాంశంతో కుటుంబ నేపథ్యంలో  నేటి యువత ఆలోచనలతో మేళవించి వచ్చిన చిత్రమే ఈ కాదలిక్క నేరమిల్లై . జయం రవి, నిత్యా మీనన్ యుగళ కలయికలో వచ్చిన తమిళ మాతృక చిత్రం ఈ నెల 12 నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓ.టి.టి. లో ప్రదర్శితమవుతోంది. 

Kadhalikka Neramillai Poster

కధా కమామీషు  

సిద్దార్థ్ (జయం రవి మోహన్) , శ్రియ (నిత్యామీనన్) ఇద్దరు అర్చిటెక్ట్స్ గా పనిచేస్తుంటారు. సిద్దార్థ్ బెంగళూరులోను , శ్రియ చెన్నైలోని సంస్థలోను పనిచేస్తూ ఉంటారు. మొదటి నుంచి కూడా శ్రియకి స్వతంత్ర భావాలు ఎక్కువ. శ్రియ, కరణ్ (జాన్ కొక్కెన్)తో ప్రేమలో ఉంటుంది. నిశ్చితార్థం తరువాత అతనికి, శ్రియ స్నేహితురాలితో ఉన్న సంబంధం తెలిసి మోసపోయిన ఆమె దూరం పెడుతుంది. ఇక బెంగుళూర్ లో నివసిస్తూ ఉన్న సిద్ధార్థ్ (జయం రవి)కి, గౌడ (యోగిబాబు) సేతు (వినయ్ రాయ్) స్నేహితులుగా ఉంటారు. ఒకసారి సేతుతో పాటు సిద్ధార్థ్ కూడా 'స్పెర్మ్' డొనేట్ చేయవలసి వస్తుంది. అయితే అతను తన పేరు జేమ్స్ అని చెప్పి, తప్పుడు అడ్రెస్ ఇస్తాడు. సిద్దార్థ్, నిరుపమతో ప్రేమలో ఉంటాడు. వీరి నిశ్చితార్ధం జరిగే సమయానికి వారికి  బ్రేకప్ అవుతుంది. సిద్దార్ద్ సహజంగా బాధ్యతలంటే భయంతో వుంటూ పిల్లలపై అయిష్టంగా ఉండటంతో నిరుపమ పెళ్ళికి నిరాకరించి వెళ్ళిపోతుంది. మరోవైపు ప్రేమలో మోసపోయిన శ్రియ పిల్లలపైన ఇష్టంతో మగవారి అవసరం లేకుండా పెళ్లి లేకపోయినా తల్లి అవ్వడం కోసం స్పెర్మ్ డోనర్ ద్వారా తల్లి అయి తండ్రి గుణ గణాలు తన బిడ్డకి ఎలాంటివి వస్తాయా అనే అనుమానంతో తండ్రి కోసం వెతుకుతుంది. అనుకోకుండా ఎనిమిదేళ్ల తరువాత కంపెనీ పనిపై చెన్నైకి వెళ్లిన సిద్ధార్థ్ కి శ్రియతో పరిచయం పెరుగుతుంది. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు, అటు శ్రియ కొడుకు పార్థివ్ కి కూడా  దగ్గరవుతున్న సమయంలో సిద్ధార్థ్ జీవితంలోకి నిరుపమ మరల రావటం అవుతుంది. అటుపై జరిగిన చిన్న విషయాలతో సిద్దార్థ్ శ్రియల జీవితం ఎటువైపు మలుపు తిరిగింది? కధ ఏ విధంగా సుఖాంతం అయింది అనేవి చిత్రాంశాలు.

విశ్లేషణ : 

కధలో ప్రేమ విరహం, రక్త సంబంధం అనే అంశాలు కొత్తవేమీ కాకపోయినా ఇప్పటి నాగరిక పోకడలకు ఆలోచనలకు అనుగుణంగా కొంచం ప్రేమ, కొంచం విరక్తితో అత్యుత్సాహంతో గీత దాటుతున్న యువత ఆలోచనలను జోడించి వాటిని చివరికి ప్రేమతో ముడిపెట్టి ఒకచోట కలిపిన కధనం ఈ చిత్రం. సిద్దార్థ్ పాత్రలో జయం రవి బాగానే నటించాడు. నిత్యా శ్రియ పాత్రలో అభినయం బానే ఉంది . పిల్లలు ఇష్టం లేకపోయినా, తరువాత నిత్యా బిడ్డకు దగ్గరయిన సిద్దార్థ్ పాత్రని  బంధాన్ని కలిపేలా తీర్చిదిద్దారు. కాకపోతే కొంచం బోల్డ్ అంశాలు పాశ్చాత్త్య నాగరిక అనుగుణంగా స్పెర్మ్ డొనేషన్ బ్యాంకు, ఐ.వి.ఎఫ్., టెస్ట్ ట్యూబ్ బేబీ వంటి అంశాలు,  చివరలో  ' గే ' ( స్వలింగ ప్రేమ ) మ్యారేజ్ వంటి అంశాన్ని చిత్రంలో చూపించటం కాస్త బోల్డ్ కంటెంట్ ని ప్రమోట్ చేసినట్టు అనిపించాయి. పెద్దల మాట పెడచెవిని పెట్టే నేటి యువత పడే ఇబ్బందిని బాహాటంగా కాకపోయినా గుప్తంగా కొంచం స్పర్శించి వదిలేసారు. ఇందులో మంచి ఎంతమంది అర్ధం చేసుకుంటారు అనేది ప్రశ్నార్ధకం. అందుకేనెమో U/A సెన్సార్ సర్టిఫికెట్ తో విడుదల చేశారు. ఓ పక్క తల్లి లేకపోయినా అన్ని తానె అయి పెంచిన సిద్దార్థ్ తండ్రి, ఈ కుటుంబ నేపధ్యం ఉన్నప్పటికీ అలా పిల్లలంటే ఎందుకు నిరాశతో ఉన్నాడు అనేది దర్శకుడు వివరించలేదు అనిపించింది. 

ఆస్తులు :

తండ్రి లేని పిల్లలు భవిష్యత్తులో పడే ఇబ్బంది, వయసులో ఉన్నంత ధైర్యం తల్లి అయ్యాక సమాజములో ఎదురయ్యే ప్రశ్నలు , పిల్లల మనసులో వచ్చే ఆలోచనలు వంటి సందేశాత్మక భావాల్ని చూపించటం, స్వతహాగా తనని తాను తక్కువగా ఊహించుకునే సిద్ శ్రియతో  ప్రేమలో పడ్డాక మార్పు తెచ్చుకోవటం 

కుదుపులు : 

గే మ్యారేజ్ ని చూపించటంలో లేని స్పష్టత, తండ్రి నుండి గొప్ప ప్రేమని పొందిన సిద్ తన జీవితంలో పిల్లల్ని బాధ్యతల్ని త్వరగా ఇష్టపడకపోవడం, పెద్దగా ఆకట్టుకోలేని రహమాన్ సంగీతం 


నటీనటులు :  జయం రవి, రవి  మోహన్ , నిత్యా మీనన్,  యోగిబాబు తదితర నటులు    
 దర్శకులు :  కృత్తికా ఉదయనిధి   
సంగీతం :  ఏ. ఆర్. రహమాన్     
 
నిర్మాత : ఉదయనిధి స్టాలిన్

ఎడిటర్ : లారెన్స్ కిషోర్ 

-- అవ్యజ్ (శంకర్) 2 .7***/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog