హిట్లర్ - 2024
హిట్లర్ - చాలా గంభీరమైన, బాగా తెలిసిన, వివాదాస్పద పేరు కూడా. మరి అలాంటి పేరుని గతంలో మన మెగాస్టార్ ఎంచుకొని ఓ చరిత్ర సృష్టించారు. మరలా అదే పేరుతో తమిళ నటుడు, బిచ్చగాడు చిత్రంతో అటు తమిళనాటనే కాకుండా ఇటు తెలుగునాట కూడా నటుడిగా మంచి పేరు అసంఖ్యాక అభిమానులను సంపాదించుకున్న "విజయ్ ఆంటోని" ఈ పేరుని ఎంచుకోవటం కొంత ఆశాజనికంగా అనిపించింది. మరి అలాంటి హిట్లర్ 2024 కధ - కమామీషు ఎంటో ఇప్పుడు చూసేద్దాం.
హిట్లర్ 2024 చిత్రం గత నెల చలనచిత్ర ప్రదర్శనశాలలలో (మూవీ థియేటర్) విడుదలై ప్రేక్షకులలో కొంత సాధారణ అభిప్రాయాన్ని సొంతం చేసుకొంది. ఒక నెల తరువాత ఇప్పుడు మళ్ళీ నవంబర్ నెల 1 నుండి ప్రముఖ ఓ.టి.టి. వేదిక అమెజాన్ ప్రైమ్ నందు ప్రదర్శింపబడుతుంది.
ప్రధాన తారాగణంలో విజయ్ ఆంటోనీ సెల్వగా , రియాసుమన్ సారా పాత్రల్లో నటించిన ఏ చిత్రానికి ధన దర్శకత్వం వహించారు.
కథ :
మరోప్రక్క చెన్నైలో ఎన్నికల హడావిడి మొదలవుతుంది. మంత్రి రాజవేల్ (చరణ్ రాజ్) తాను తప్పకుండ గెలవాలనీ, ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలనే పట్టుదలతో ఉంటాడు. అతనికి తమ్ముడు నల్లశీను అందుకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ సాయంగా ఉంటాడు. ఈ సమయంలో సెల్వా (విజయ్ ఆంటోని) ఉద్యోగ ప్రయత్నం చేయటం కోసం చెన్నైకి చేరుకుంటాడు. తెలిసిన ఓ మిత్రుని కలిసి, ఉద్యోగం దొరకగానే వేరే గది చూసుకుంటానని అప్పటివరకు స్నేహితుడితో పాటు ఉండనివ్వటానికి స్నేహితుడిని ఒప్పిస్తాడు.
అలా ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న సెల్వ లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న సమయంలో అతనికి , సారా (రియా సుమన్) తారస పడుతుంది. అలా పరిచయం పెంచుకున్న సెల్వకి సహజంగానే ఆ పరిచయం త్వరలో వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో, రాజవేల్ తన నియోజక వర్గంలో భారీగా ప్రజలకు పంచడం కోసం 400 కోట్లు తెప్పిస్తాడు. తెలిసిన అదే వూరి దొంగల చేత లోకల్ ట్రైన్ లో డబ్బు చేరవేయటానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ నియోజక వర్గానికి చేరడానికి ముందే ఆ డబ్బును ఎవరో కాజేస్తూ ఉండటం, అదే సమయంలో తన అనుచరుల హత్య కూడా జరుగుతూ ఉండటం ఇటు రక్షకభటులు మరియు ప్రభుత్వంలోకి రావాలనుకొనే రాజవేల్ తో పాటు ఈ వ్యవహారాలు అన్ని చూసుకుంటున్న తన తమ్ముడు నల్లశీనుని కలవరపెడుతుంది. తన డబ్బును ఎవరు కాజేస్తున్నదీ తెలుసుకుని అతనిని తనకి అప్పగించమని ఏసీపీ శక్తి (గౌతమ్ మీనన్)కి రాజవేల్ చెబుతాడు. అలా 400 కోట్లు కొట్టేసింది, 4 హత్యలు చేసింది ఎవరో తెలుసుకోవడం కోసం శక్తి రంగంలోకి దిగటంతో కథ మధ్యమంగా జరుగుతూ ఉంటుంది. ఈ హత్యలు ఎవరు ఎందుకు చేసారో తెలుసుకొనే పనిలో అనుకోకుండా సెల్వకి ఏమైనా సంబంధం ఉందేమో అనే కోణం బయటకి వస్తుంది. ఇలా చివరికి ఎవరు ఇదంతా చేసారు, సెల్వ ఇందులో భాగం అయ్యాడా లేదా అనేది తెలుసుకోవాల్సిన మిగిలిన చిత్ర భాగం.
ఆస్తులు:
ప్రథమార్ధంలో కధానాయకి - నాయకుల మధ్య ఉన్న చిన్న సరదా సన్నివేశాలు, రెండవ భాగంలో ఉన్న భావోద్వేగ సన్నివేశాలు, ఫర్వాలేదు అనిపించే నవీన్ కుమార్ ఫొటోగ్రఫీ, వివేక్ - మెర్విన్ నేపథ్య సంగీతం
కుదుపులు :
కధలో పెద్దగా మలుపులు లేకపోవడం, డబ్బును కొట్టేసింది ఎవరు, దానికి కారణం ఏమిటి అనేది ముందుగానే తెలిసిపోవడం, సాధారణ కధ, మంచి కధలను ఎంచుకొనే విజయ్ ఆంటోని పైన ఆ నమ్మకం నిరూపణ కాకపోవడం.
దర్శకత్వం: ధన
నటీనటులు: చరణ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ , విజయ్ ఆంటోని, రియా సుమన్
బ్యానర్: చెందూర్ ఫిలిం ఇంటర్నేషనల్
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.