Kathaa - Kamaameshu

  కథా కమామీషు

మనిషి జీవితంలో సాధారణంగా వుండే మలుపులు ఉద్యోగం, చదువు, పెళ్లి, పిల్లలు. ఇలా ఓ ఇంటివారయితే వారి గురించి పట్టించుకోవటం ఆపేస్తాం. కానీ ఆ పెళ్లి అనే ఘట్టం ముగిసిన తరువాతనే  మనిషి జీవితంలో అసలైన 'కథాకమామీషు' మొదలవుతుందని చెప్పదలచుకున్న దర్శకులు గౌతమ్ - కార్తీక్, అక్కడి నుంచి ఈ  కథను అల్లుకుంటూ వెళ్లారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ ప్లాట్ట్ ఫార్మ్ లో విడుదల చేసారు. 4వ తేదీ నుండే ఈ చిత్రం 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్ర కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథా కమామీషు 

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన తెలుగు చిత్రమే ఈ క‌థా క‌మామీషు. ఈ చిత్రంలో ఇంద్ర‌జ‌, క‌రుణ‌కుమార్‌, వెంక‌టేష్ కాకుమాను ప్రధాన భూమికని పోషించారు.

ఈ చిత్రం ప్రధానంగా పెళ్ళైన, చేసుకోబోయిన నాలుగు జంటల మధ్య తిరిగే కధ. మొదటి జంట, స‌త్య (వెంక‌టేష్ కాకుమాను) బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు. త‌ల్లి చిన్న‌త‌నంలోనే చనిపోవటం, అన్న‌య్య‌ల‌తో పాటు తండ్రి ఏ ప‌ని పాట లేకుండా స‌త్య సంపాద‌న‌పై ఆధార‌ప‌డి బ‌తుకుతూ ఉండే కుటుంబం. బ్యూటీ పార్ల‌ర్‌లో ప‌నిచేసే ఉష‌ను (హ‌ర్షిణి) ని ప్రేమించి పెళ్లిచేసుకొంటాడు సత్య. ఐతే పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఉష‌తో మాట్లాడటం ఎందుకు మానేశాడు? పెళ్లికి ముందు ఉన్న ఆనందం అత‌డికి ఎందుకు దూర‌మైంది అన్న‌ది ఓ క‌థ‌.

ఇక రెండవ జంటదివ్య (కృతిక‌రాయ్‌) అలవాటుగా ఆడే ఆన్‌లైన్‌ ర‌మ్మీ ఆట‌లో మూడు ల‌క్ష‌లు పొగొట్టుకుంది. కాబోయే భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన బాలుతో(కృష్ణ ప్ర‌సాద్‌) పెళ్లి కుదిరాక, ఆ అప్పు విషయం భ‌ర్త‌కు తెలిసేలోపు బ్యాంకు లోన్ తీసుకొని తాను ఆటలో పొగొట్టుకున్న అప్పును తీర్చేయాల‌ని అనుకుంటుంది. లోన్ వ‌చ్చిందా? దివ్య అప్పు విష‌యం బాలుకు తెలిసిందా? లేదా? అన్న‌దే ఈ రెండవ జంట క‌థ‌.

మూడవ జంట, క‌ల్ప‌న (ఇంద్ర‌జ‌) పోలీస్ ఆఫీస‌ర్‌, ఓ బాబు పుట్టాక భ‌ర్త చ‌నిపోతాడు. తాను బాబాయి గ భావించే కాదంబరి కిరణ్ పోరగా పోరగా రెండవ పెళ్లికి ఒప్పుకుంటుంది. క‌ల్ప‌న‌ను రెండో పెళ్లి చేసుకుంటాడు శ్రీధ‌ర్ (క‌రుణ కుమార్‌). శ్రీధర్ భార్య అత‌డిని వ‌దిలిపెట్టి వెళ్లిపోతుంది. ఇద్దరికీ ఇది రెండవ పెళ్లి. వీరి మధ్య బంధం ఎలా ఉంటుంది అనేది ఇంకో కధ.

నాలుగవ జంట, ఓ యువ జంట‌ కిర‌ణ్-స్ర‌వంతి. కిర‌ణ్ చేసిన టిక్‌టాక్ వీడియోలు చూసి స్ర‌వంతి (శృతిరాయ్‌) అత‌డిని ప్రేమిస్తుంది. పెద్ద‌ల‌ను ఎదురించి ఆర్య‌స‌మాజ్‌లో పెళ్లిచేసుకున్నప్పటికీ పెళ్లి త‌ర్వాత కుటుంబ‌స‌భ్యుల‌కు దూర‌మ‌య్యాన‌నే ఫీలింగ్‌తో భ‌ర్త‌ను స‌రిగ్గా ప‌ట్టించుకోదు స్రవంతి. దాంతో వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. ఆ త‌ర్వాత ఏమైంది అన్న‌ది శృతిరాయ్‌ కిరణ్ జంట కథలో ఆవిష్క‌రించారు.

విశ్లేషణ

దర్శకుడే గౌతమ్ ఈ చిత్రానికి కథను అందించాడు. ప్రేమ - పెళ్లి అనే రెండు అంశాలను కలుపుకుంటూ సాగే ఈ కధలో పెళ్లి తరువాత ఉండే జీవితం ఒక్కో జంటని ఉదాహరణగా తీసుకొని పరిస్థితులని చూపించారు. ప్రేమ వివాహమైన పెద్దలు కుదిర్చిన వివాహమైన కూడా మొత్తంగా పెళ్లి అనేది ఓ జంటను ఎలా ప్రభావితం చేస్తుందనేది చెప్పడానికి దర్శక ద్వయం గౌతమ్- కార్తీక్ ప్రయత్నించారు. ఈ నాలుగు జంటల, వారి  కుటుంబాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఈ నాలుగు జంటల పాత్రలను వారి మధ్య సన్నివేశాలను రసవత్తరంగా అల్లుకుని ఉంటే కథ పట్టుగా ఆహ్లాదంగా పరిగెత్తేది. కానీ అది పెద్దగా జరగక పోవడం వలన కథ నీరసంగా కొనసాగినట్లుంది. 
ఒక్క పాత మినహా మిగిలిన పాటలు, సరియైన వినోదం లోపించడం ఈ చిత్రం విజయానికి లోటు. దర్శకులు ఎంచుకున్న స్టోరీ లైన్ మంచిగానే ఉన్నప్పటికీ అది కధల అల్లికలో ప్రభావము చూపలేదు. 

కుదుపులు: 

సాధరణంగా పెళ్ళైన జంటల మ‌ధ్య వ‌చ్చే స‌మ‌స్య‌లు, వాటి ప‌రిష్కారాల‌ను సింపుల్‌గా చూపించారు. పెళ్ళైన వారి మ‌ధ్య అపోహ‌లు నెల‌కొన‌డానికి కార‌ణ‌మ‌య్యే స‌న్నివేశాల‌ను కొంత లోతుగా రాసుకుంటే బాగుండేది.

ఆస్తులు:

దివంగ‌త గాయ‌కుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆల‌పించిన పెళ్లి పాట వీనుల‌విందుగా ఉంది. అన్ని జంటల్లో పెళ్లి తరువాతి మొదటి రాత్రి అనే అంశంతో ముడి పెట్టి ప్రధానంగా జంటల మధ్య పరస్పర భావాలను అర్ధం చేసుకోవటం ముఖ్యం అనే సారాశం బావుంది.

నటీనటులు : ఇంద్రజ, కరుణ కుమార్, కృత్తిక రాయ్ , కృష్ణ ప్రసాద్, హర్షిని, మోయిన్ 
దర్శకుడు : గౌతమ్ - కార్తీక్ 
సంగీతం : ఆర్. ఆర్. ధృవన్  
బ్యానర్ : త్రీ విజిల్స్ టాకీస్ , ఐ డ్రీం మీడియా 

-- అవ్యజ్ (శంకర్) 2.8 ***/5***** 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog