శివరపల్లి- అమెజాన్ ప్రైమ్
ఈ చిత్రం ప్రముఖ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ కు ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకొని అనువాదంతో మరల నిర్మించినది. ఈ నెల 24 నుండి (జనవరి 24) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘సివరపల్లి’ పేరుతో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఇక ఈ వెబ్ సిరీస్ కథాకమామీషు ఏమిటో ఇప్పడు ఈ రివ్యూలో చూద్దాం.
కధా కమామీషు :
కధా నాయకుడు శ్యామ్ (రాగ్ మయూర్) బిటెక్ పూర్తి చేసి తన స్నేహితులతో కలిసి పై చదువుల కోసం అమెరికా వెళ్లాలని అనుకుంటాడు. కానీ, తన తండ్రి బలవంతంతో ఇష్టం లేకుండా చేసిన ప్రయత్నం ఫలించి గ్రామ పంచాయతీ సెక్రటరీ పరీక్షలో ఉత్తీర్ణుడవటంతో ఉద్యోగంలో చేరుతాడు. కామారెడ్డి జిల్లా, తెలంగాణలోని మారుమూల గ్రామం అయిన 'సివరపల్లి' లో శ్యామ్ పోస్టింగ్ వస్తుంది. అక్కడికి ఉద్యోగంలో చేరటానికి వెళ్లటంతో మన సిరీస్ మొదటి ఎపిసోడ్ మొదలవుతుంది. మహిళా రిజర్వేషన్ తో ఈ ఊరి సర్పంచ్ అయిన సుశీల (రూపలక్ష్మీ) వంటింటికే పరిమితం అవటంతో ఆమె భర్త సుధాకర్ (మురళీధర్ గౌడ్) ఆ బాధ్యతల్ని చూస్తుంటాడు. ఇష్టం లేకుండా చేరిన ఉద్యోగం, అలవాటులేని పల్లెటూరి మనుషులు వాటి నుండి శ్యామ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఆ పంచాయతీ ఆఫీస్ వాతావరణం, ఉద్యోగులు, సర్పంచ్ భర్తతో శ్యామ్ ఎలాంటి కష్టాలను అనుభవిస్తాడు..? శ్యామ్ వదిలేసిన అమెరికా ప్రయత్నం ఫలిస్తుందా..? అనేది ఈ సిరీస్ కథ.
విశ్లేషణ:
ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే చూడదగినది. రాజ్ మయూరి చేసిన నటన బావుంది. ఇకపోతే ఒకే గ్రామంలో జరిగిన పూర్తి సిరీస్ అయినప్పటికీ ఎలాంటి నిస్సారం లేకుండా చేసినది. లీనమయ్యే ప్రేక్షకుడిని కధ ఆసాంతం చూడాలనిపించేలా ఉంది. తెలంగాణ భాష యాస ఉన్నప్పటికీ అర్ధమయ్యే రీతిలోనే ఉన్నాయి. మాటలతోనే హాస్యం పండించారు. అమాయక మౌన పాత్రలో సెక్రటరీగా శ్యామ్ నటన అభినందనీయం. స్త్రీలకు కూడా స్వతంత్రం ఉండాలి, వాళ్ళు ప్రపంచంతో పాటు సాగుతూ, మగవారితో సమాన హక్కులు ఉండాలి అని మరీ బోర్ కొట్టించకుండా చిన్న సన్నివేశాలతో క్లుప్తంగా రచయిత చూపించారు. అందమైన నేటివిటీ తో శుభ్రమైన మాటలు కుటుంబం కలిసి చూసే చిత్రమే అయినా, భాగాల నిడివి (లెంగ్త్) కాస్త ఎక్కువగా ఉండటం ప్రేక్షకుడి ఓపికని పరిక్షిస్తాయి.
కుదుపులు :
భాగాల నిడివి ఎక్కువగా ఉండటం, కధ మొత్తం ఒకే ఊరిలో తిరుగుతూ ఉండటంతో ప్రేక్షకుడు కొంత అసహనంకి లోనుకావచ్చు, హాస్యం ఇంకాస్త జోడించి ఉంటె బావుండేదనిపించింది, చివరి వరకు నాయిక లేని లోటు, శృంగార భరిత సన్నివేశాలతో బంధం లేకపోవడం ఒ తరగతి ప్రేక్షకుడికి లోటు అనిపించవచ్చు
ఆస్తులు :
కొత్తగా వచ్చిన ఆఫీసరుతో అమాయక జనం కలిసిపోయే తీరు పల్లె వాతావరణం తెలిసిన ప్రేక్షకుడి మనసుకి హత్తుకుంటుంది, ప్రజలతో మమేకం అవ్వడం పొరపచ్చాలు లేని ఆత్మీయ సంబంధాలు, ఎలాంటి అసభ్య పదాలు , సంభాషణలు, సన్నివేశాలు లేకపోవడం, స్త్రీలను గౌరవించి సహకరించే తీరు ఆకట్టుకుంటాయి.
నటీనటులు : మురళీధర్ గౌడ్, పావని కరణం, రాగ్ మయూర్, రూపలక్ష్మీ, ఉదయ్ గుర్రాల, సన్నీ పల్లె తదితరులు
దర్శకుడు: భాస్కర్ మౌర్య
సంగీతం : సింజిత్ ఎర్రమిల్లి
నిర్మాత : విజయ్ కోశి, అరుణభ్ కుమార్, రవికిరణ్ మదినేడి
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.