Kaalamega Karigindi - A 90's Love

 కాలమేగా, కరిగింది..?

 " కొన్ని ప్రేమ కథలు కధలుగానే మిగులుతాయి, కానీ కొన్ని కధల్లో ప్రేమ ఉంటుందట" ఇలాంటి కవితాత్మక మాటలు, అచ్చ తెలుగు పదాలతో కలిపి తీసిన చిత్రం. ఏలాంటి చిత్రమైనా అన్ని కథల్లో ప్రేమ, శృంగారం లేకుండా నడవని పరిశ్రమ చిత్ర పరిశ్రమ. కాకపోతే కొన్ని చిత్రాలలో ప్రేమ ఓ భాగంగా ఉంటే ఇంకొన్ని చిత్రాలు కేవలం ప్రేమే ప్రధానాంశంగా ఉంటాయి. అలాంటి కోవలోకి చెందిన చిత్రమే ఈ " కాలమేగా కరిగిందికలహాలే లేని ఓ ప్రేమకథ  అనే శీర్షికతో మార్చి నెలలో కవితా దినోత్సవం సందర్భంలో విడుదలయి ఈ నెల 9 నుండి సన్ నెక్స్ట్ ఓ.టి.టి. ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 

కలహాలే లేని ప్రేమ కధ: ఉప-శీర్షికకి తగినట్టు ఈ చిత్రం ఒక చక్కని లేత వయసు పచ్చిక లాంటి ప్రేమ కథ. ప్రతి మనిషికి యవ్వనమంటే పరిచయమయ్యే లేత వయసులో చిగురించే స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమనే కొందరు ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్ అంటే కొందరు చిన్నారి ప్రేమ అని చెప్తారు. స్వచ్ఛమైన అని ఎందుకు అనాలి అంటే, అప్పుడే జరిగే శారీరక మార్పులతో కలిపి తెలిసి తెలియని అమాయకపు మనసు పెట్టే గిలిగింతలు. ఏ స్వార్ధం, అర్హత, డబ్బు, స్థాయి లాంటివి చూడని, తెలియని, కలలోనైనా ఆలోచించని మనసు చెప్పే మొదటి భావాల నుండి పుట్టే అనుభూతి. 

కొందరు దానిని మరిచిపోతే, ఇంకొందరు మనసులో దాచుకొంటే, మరికొందరు ఓ జ్ఞాపకాల పుస్తకంలో పేజీల్లా జీవితంలో మోసుకొంటూ ఒంటరిగా ఉన్నప్పుడు నెమరు వేసుకొని నవ్వుకొనే లేదా బాధపడే భావన. ఏ ఒక్కరికో లేదా అదృష్టవంతులకో ఆ భావన అనే పేజీ, తమ జ్ఞాపకాల పుస్తకం నుండి విడివడి జీవితంలో  జరిగే పరిణయంగా మారుతుంది.

WPS Office - AI Features Free Download

ఆ... ఇదేం సినిమాలే అని పట్టించుకోని చిత్రాల జాబితాలో చేరి, చూసేటప్పుడు మీ మదిలోని జ్ఞాపకాల చిట్టాని తట్టి లేపి కొందరిని బాధపెట్టి, కొందరిలో చిరునవ్వు తెప్పించే చిత్రం.. కరిగింది కాలమే గాని ప్రేమ కాదు .. జ్ఞాపకమూ కాదు. 😊మీ పాఠశాల ప్రేమ రహస్యాల పుస్తకం. 😜😉 


Kalamega Karigindi OTT Banner


కథా కమామీషు 

ఇక కాలం వెనక్కి జరిగి మన కథలోకి వెళితే ఫణి(అరవింద్), బిందు (నోమిన తార) చిన్నప్పటి నటులు ఓ పాఠశాలలో చదువుకుంటూ వుంటారు. చదువు ముగించుకొని జీవితంలో స్థిరపడి పాత జ్ఞాపకాలను మరచిపోలేని వినయ్ కుమార్ (ఫణి) వాటిని వెతుక్కుంటూ ఊహల్లోనే కాకుండా నిజంలో కూడా పాత  ఊరిని, చదివిన పాఠశాలని వెతుక్కుంటూ స్నేహితుడితో కలిసి గ్రామానికి వెళ్తాడు. 

ఇలా జరుగుతూ కధ మొదలవుతుంది. పాఠశాలలో పరిచయం చేసిన బిందు, ఫణిల మధ్య జరిగే ప్రేమ కవితలు, మాటలు, చిలిపి స్నేహం, అసభ్యతలేని స్వచ్ఛమైన ప్రేమ సన్నివేశాలతో పూర్తి చిత్రం నడుస్తుంది.
ఒకరిని ఒకరు మర్చిపోలేని ఇద్దరు చిన్నప్పటి ప్రేమికులు ఎందుకు విడిపోతారు, దాదాపు 20 సంవత్సరాల తరువాత కలుసుకొంటారా లేదా అసలు అంతలా జ్ఞాపకం పెట్టుకుని నిజంగా ఎదురుచూస్తారా అనేది చిత్ర కథాంశం. 

విశ్లేషణ

పూర్తి ముద్దొచ్చే చిన్ననాడు పుట్టిన ప్రేమ జ్ఞాపకాలను స్పృశింపచేసి, వర్ణించే చిత్రకథ. పూర్తి తెలుగు పదాలతో ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమని ఆస్వాదించి రాసే, పలికే పదాల, మాటల, కవితలతో నడిచిందీ చిత్రం. దర్శకుడు శింగర మోహన్ అనుకున్నట్లు కవితా దినోత్సవంకు స్ఫూర్తిగా వీలైనన్ని సన్నివేశాలు పూర్తి కవిత్వంలో నింపి ప్రేమ పుష్పాలని పూయించారు. ఇద్దరు బాల నటుల హావ భావాల నటనలో ఆ పుష్పాలు మంచి సుగంధ పరిమళాన్ని వెదజల్లాయి. చిత్రం ఆఖరులో పెద్దవాళ్ళైన యువ జంట బిందు, ఫణి (వినయ్ కుమార్, శ్రావణి) కనిపించి మురిపించారు. పెద్దగా వేరే సందర్భం లేకుండా కేవలం చిన్ననాటి ప్రేమ అనే అంశమే తీసుకున్నప్పటికీ ఎక్కడా విసుగు పుట్టకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. 

Dedicated Server

పటిష్టమైన స్క్రీన్ - ప్లేతో కధనం రక్తికట్టించాడనే చెప్పాలి. ఫణి - బిందుల జంటనే ముఖ్యంగా చిత్రాన్ని చివరి వరకూ నడిపింది. పల్లెటూరి వాతావరణం, అప్పటి కాలంలో వలెనే ఉత్తరాల ద్వారా ప్రేమికుల భావాల్ని భద్రపరిచే, ఇద్దరి మధ్య చేరవేసే ప్రముఖ సమాచార సాధనంగా మలిచి చూపించారు. సంగీతం ప్రేమికుల భావాలకు తగినట్లుగ జోడించి వినిపించారు. 

పూర్తి కమర్షియల్ చిత్రాలు, స్టంట్స్ ,మాస్ ప్రేక్షకులకి ఇది దూరమనే చెప్పాలి. తెలుగు భాష, పదాలు, కవిత్వం, ప్రేమ - విరహం వంటి భావోద్వేగం అనుభూతి చెందే వారికి మరీ దగ్గరయ్యే చిత్రం. ప్రేక్షకుడి మనో ఫలకంలో రాసుకున్న, జ్ఞాపకాలలో దాగివున్న చిన్ననాటి ప్రేమ, మనసులో మరుగుపడిపోయిన ప్రేమ, చిలిపి అల్లరిని ఖచ్చితంగా తిరిగి గుర్తుచేస్తుంది. 

ఆస్తులు

బాల్య జ్ఞాపకాలు తెచ్చే బాల నటుల నటన, సన్నివేశాలు, ప్రేమ కవితలు, మాటలు, స్వచ్ఛమైన ప్రేమంటే మాటకి కట్టుబడి ఎదురుచూసిన ప్రేమికుల తత్వం, మృదు సంగీతం, ప్రేక్షకుడికి గుర్తు చేసే గ్రామీణ, పాఠశాలల పరిసరాలు, టైటిల్స్ నుండి ఆచరించిన పూర్తి తెలుగు భాష జ్ఞానం, దర్శకుడి సాహిత్య విలువలు 

కుదుపులు

వినగానే కొత్తదనం ఏమి లేదుగా అనే కథ, పెద్దగా పేరు - పరిచయం లేని పాత్రధారులు, హాస్యం వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, బిందు పాత్రకి ఇంకొంచం అందంగా ముద్దుగా ఉండే నాయికని ఎంచుకుని ఉంటే ఇంకా బావుండు అనిపించింది, స్లోగా సాగే కధనం 

నటీనటులు :  శ్రావణి మజ్జలి , వినయ్ కుమార్, అరవింద్, నోమీన తార తదితరులు   
దర్శకులు, రచయిత :  శింగర మోహన్    
సంగీతం :  
 బలం గుడప్పన్   
నిర్మాత :  మారె శివశంకర్, శింగర క్రియేటివ్ వర్క్స్     

సినిమాటోగ్రఫి: వినీటి పబ్బతి  

-- అవ్యజ్ (శంకర్) 2.95***/5*****


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog