టూరిస్ట్ ఫ్యామిలీ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చే, దర్శక స్టార్ రాజమౌళిచే ప్రశంశలు అందుకున్న చిత్రం
మంచి చిత్రాన్ని అందరూ తప్పక ఆదరించాలి. అదే బాధ్యతకల ధర్మం కూడా. అప్పుడప్పుడు మాత్రమే విలువలున్న, భావాత్మక మరియు సందేశాత్మక చిత్రాలు వస్తూ ఉంటాయి. ఆలాంటివి తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమ నుండి ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి కోవకు చెందినదే ఈ టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం, జూన్ 2 వ తేదీ నుండి జియో హాట్ స్టార్ వేదికలో ప్రదర్శనలో ఉంది.
టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం పేరులో ఫ్యామిలీ పెట్టుకున్నట్టు కుటుంబంతో కలిసి చూడతగినది. అశ్లీలత, ఆర్భాటం లేని చిత్రం. మంచి కథతో చిత్రం తీయటానికి పెద్దగా కుస్తీ అవసరం లేదని, కేవలం ఒక చిన్న బిందువంటి అంశంతో పూర్తి కథను 2-3 గంటలు నడిపించవచ్చు అని కొన్ని చిత్రాలు నిరూపిస్తుంటాయి. ఈ చిత్రం కూడా అలా వచ్చిన చిన్న నోరుమంచిదైతే-వూరు మంచిదౌతుంది అనే నానుడికి దగ్గరగా సాగే చిత్రం.
కథా కమామీషు
అభిషన్ జీవింత్ దర్శకత్వంలో ఇటీవల విడుదలై కేవలం 8కోట్ల ఖర్చుతో తీసినప్పటికీ, దాదాపు 80 కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రం. మరి చిత్ర కథ ఏమిటంటే , శశికుమార్ (ధర్మ దాస్) , సిమ్రాన్ (వాసంతి)ల జంట శ్రీలంకలో ఉండే కుటుంబం. అక్కడి ద్రవ్యోల్బణ అనిశ్చితి పరిస్థితుల వలన తమ ఇద్దరు పిల్లలతో కలిసి భారత్ కు వలస వస్తారు. అలా వచ్చిన వాళ్ళకి మామయ్య ప్రకాష్ సహాయంతో ఓ జీవనం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతాయి.
అందరితో పరిచయాలు పెంచుకొని మంచితనంతో కలిసి ఆదర్శంగా నిలిచిన కుటుంబం అవుతుంది. అదే సమయంలో వీరుండే ప్రదేశంలో ఓ బాంబు పేలుడు జరిగుతుంది, అది శ్రీలంక వాసుల వలన అని విచారణలో తెలియడంతో ఆ దాడికి వీరికి ఏమైనా సంబంధం వుందేమో అని అనుమానంతో మొదటిగా వారిని కలిసి పంపివేసిన పోలిసు ఇన్స్పెక్టర్ ద్వారా వెతకడం ప్రారంభించడం తర్వాత ఆ విచారణ ఏమైంది, అసలు పోలిసు వారిది అనుమానమేనా లేక నిజమా, ఆ విచారణకి వచ్చిన పోలీసులకి ఎదురైనా విషయాలు ఏమిటి అనేది చిత్ర కధనం.
విశ్లేషణ
పూర్తి కుటుంబ కధా చిత్రం అంటే భార్య భర్తలనే కాకుండా పిల్లలు, ఓ మనిషి ఎలా ఉండాలి, కుటుంబంలో ఆప్యాయతలు ఇలా అన్ని కలిపితీసిన చిత్రం. వాసంతి గ సిమ్రాన్ ఇంకా, శశికుమార్ ఇద్దరు నటన బావుంది. వారు కాలనీ లోని ప్రతి కుటుంబంతో అరమరికలు లేకుండా కలిసిపోవడం, నిజాయితీగా వుంటూ సహాయం చేయడం ప్రేమని పంచడం వంటివి చిత్రానికి హైలైట్స్. ప్రతి సన్నివేశం మన జీవితాల్లో జరిగేది అన్నట్టు నిర్మించాడు దర్శకుడు.
మన కాలనీలో జరిగే విషయాల చుట్టు తిరుగుతుందా అన్నట్లుంది. డ్రైవర్ గా చేరిన శశిధర్, ఆ కుటుంబంతో అనుబంధం, పక్కనే ఉన్న ఓ కులాంతర వివాహ దంపతులతో ఇలా ప్రతి సన్నివేశం ఓ హృద్యమైన భావాల్ని చూపించారు. మనిషి మనిషిలా పరిపూర్ణమైన వ్యక్తిగా బ్రతకడం చెప్పినంత సులభం కాదు అనేది ఈ చిత్రంలో తెలుస్తుంది. కుటుంబంలో పిల్లలు చేసిన హాస్యం, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తప్ప హాస్యం పండలేదు. సంగీతం పరవాలేదు అనిపించింది. మొత్తం ఒకే కాలనీలో తిరిగే చిత్రం.
ఆస్తులు
సహజత్వం ఈ చిత్రానికి పెద్ద ఆస్తి, హింస, అశ్లీలం లేని పూర్తి భావోద్వేగ చిత్రం, కుటుంబం మొత్తం కూర్చుని హాయిగా చూడగలిగే చిత్రం, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ
కుదుపులు
మిధున్ జై - యోగలక్ష్మి పాత్రలలో వీరిద్దరి మధ్య నటన ప్రేమ సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోకపోవడం , సిమ్రాన్ పాత్రని ఇంకా కొంచం పెంచి ఆసక్తిగా చేసుంటే బావుండేదనిపించింది, కమర్షియల్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకి ఆశాభంగమే
ఓ.టి.టి. ప్లాట్ట్ ఫార్మ్ : జియో హాట్ స్టార్
నటీనటులు : శశిధర్, సిమ్రాన్, మిథున్ జై శంకర్ , యోగిబాబు, కమలేష్ తదితరులు
దర్శకులు, రచయిత : అభిషన్ జీవింత్
సంగీతం : సియాన్ రొల్డన్
సినిమాటోగ్రఫి: అరవింద్ విశ్వనాథన్
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.