కథా సుధ
"చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని..." అలాటి కథలంటే సరదా కోసం కొన్ని ఉంటే, విలువలు నేర్పేవి కొన్ని , హాస్యం పంచేవి మరికొన్ని , తెలివితేటలు పెంచేవి ఇంకొన్ని ఉంటాయి. అలాంటి వినోదంతో పాటు విలువలు, పాత జ్ఞాపకాలు, పాత పద్ధతులు మరుగున పడుతున్న విషయాలను వెలికి తీసి కొత్తవారికి కొత్తగా పరిచయం చేస్తూ ఈటీవీ విన్ లో ప్రసారమవుతున్న వారాంతపు పొట్టి చిత్రాల సమాహారమే ఈ కథా సుధ
చిత్రలహరి, దూరదర్శన్ వారి ఆదివారం చిత్రం వంటి వాటితో పాటు మాల్గుడి కథలు ఓ తరం వారికి గుర్తుండే ఉంటాయి. అలానే దూరదర్శన్ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయకపోయినా అవే సాహిత్య, తెలుగు భాషా విలువలను ఆనాడు నుండి ఈనాడు వరకు పాటించడములో ఈటీవీ బృందం ఇప్పటికీ ముందే ఉంది.
పొట్టి చిత్రాలు - వాటి కధా కమామీషు
గత ఏప్రిల్ నుండి ఈ పొట్టి చిత్రాల ప్రవాహం వారం వారం ఆదివారంలా ఈటీవీ-విన్ ఒరిజినల్స్ లో ప్రవహిస్తూనే ఉంది. మరి ఇప్పటికి ఎన్ని అయ్యాయి, వాటి కథా కమామీషు ఏమిటో, ఒకట్రెండు ఉదహరిస్తూ ఓసారి క్లుప్తంగా, సంక్షిప్తంగా, సూటిగా, సుత్తిలేకుండా చదివేద్దాం.
మనమంతా పూర్తిగా మరిచిపోయిన పెద్దగా అవసరపడని ఉత్తరంతో మొదలుకొని డియర్ డాడీ వరకు మొత్తం 11- వారాల వరాల హారాలతో సాగిన సమాహారం ఈ కథాసుధ. ప్రతి వారం కొత్త భాగాలు, కొత్త కథలతో, కొత్త నటీనటులతో 25 ని" నుండి 45 నిమిషాల నిడివికి మించకుండా, ప్రేక్షకుడిని విసిగించకుండా , కొత్తగా సాగుతున్న ప్రవాహం.ఈ జూన్ నెల విడుదలైన భాగాలు అమృతవల్లి, డియర్ డాడీ
విశ్లేషణ
వారం వారం ఆదివారం వచ్చే భాగాలలో ఒక్కో కథ ఒక్కో అంశంలా తీసుకొని చెప్పాలనుకున్నది పొట్టిగా తక్కువ సమయంలో చెప్పటంలో దర్శకుడు వేగేశ్న ఉతీర్ణుడు అయ్యాడనే చెప్పచ్చు. ఒక్కో భాగం గురించి క్లుప్తంగా చదవండి.
ఉత్తరంతో అక్షరం అనే పదంలో క్షరం కానీ భావాలను అక్షరాల రూపంలో ఆస్వాదించటం నేర్పి, గుర్తుచేసినా, లవ్ యూ నానమ్మ తో పెద్దవారికి పిల్లలకి మధ్య అనుబంధం చెప్పి వృద్దాశ్రమాల పద్దతిని విమర్శించినా, వెండి పట్టీలుతో ఓ పేద రైతు కష్టాలు దాని ద్వారా కుటుంబంలో తల్లితండ్రుల ప్రేమని వ్యక్తపరిచినా, కాలింగ్ బెల్ తో మనిషి మనిషి మధ్య ఆప్యాయతలు అవసరాలలో ఆదుకునే మనస్తత్వం గురించి వివరించినా, పెంకుటిల్లు లో ఉన్న జ్ఞాపకాలు, పిల్లల అభిప్రాయాన్ని గౌరవించే పెద్దల మనోభావాలు తెలిసి నిర్ణయం మార్చుకున్న పిల్లల-పెద్దల మంచితనం, నాతి చరామితో వృద్దాప్యంలో ఉన్న భార్య భర్తల బంధం, ఒకరిపై ఒకరికున్న ఆధారం, వారి మధ్య విదేశాలలో స్థిరపడిన పిల్లల మూలంగా వచ్చిన విరహం చూపించి ఓప్పించి-మెప్పించి-నిజం అని నిరూపించిన కథలన్నీ కలిపి చేసిన కృషి ప్రశంసనీయం.
![]() |
Top Offers from Top Brands - Hurry up!! Explore more !!! |
అన్ని భాగాలు పల్లెటూరు చుట్టూ తిరిగేవి, పచ్చని పైరు లాంటి కుటుంబ చిత్రాలే. మాల్గుడి కథలను ప్రేరణగా తీసుకొని ఈ కథా సుధ కల్పకం సృష్టించినట్లు అనిపించింది. నటనలో పరిచయం వున్న అనుభవం వున్న నటులు, ధారావాహికల నటీమణులతో చిత్రీకరించిన భాగాలు.
ఆస్తులు
దర్శకుడు రచయిత ఎంచుకున్న భాగాల ఇతివృత్తాలు, సినిమాటోగ్రఫీ, మామూలు సిరీస్ లా ఒకే కథను పదులు-వందల సంఖ్యలో కాకుండా ప్రతివారం ఓ కొత్త కథని తీసుకోవడ౦, కె. రాఘవేంద్రరావు మరియు సతీష్ వేగేశ్నల పర్యవేక్షణ మరియ దర్శకత్వం.
ఓ.టి.టి. ప్లాట్ట్ ఫార్మ్ : ఈటీవీ విన్
నటీనటులు : తనికెళ్ళ భరణి, రాజ్యలక్ష్మి, నరేష్ సీనియర్, నందకిశోర్, బాలాదిత్య, మణిచందన, శరణ్య ప్రదీప్ ఇంకా చిన్న పెద్ద ధారావాహిక-చిత్రసీమ నటులు
దర్శకులు, రచయిత : కె. రాఘవేంద్రరావు మరియు సతీష్ వేగేశ్న
సంగీతం : ఎస్. కె. బాలచంద్రన్
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.