Mystery of Moksha-Island

మిస్టరీ అఫ్ మోక్ష ఐ-ల్యాండ్ (డిస్నీ+హాట్ స్టార్)

ప్రియా ఆనంద్‌, నందు విజయ్ కృష్ణ (Hero), తేజస్వీ మడివాడ, అక్షర గౌడ, నయన్ సారిక (ఆయ్ ఫేమ్), అసుతోష్ రాణా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన "ది మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐలాండ్" వెబ్‌ సిరీస్  20 సెప్టెంబర్ నుండి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయిన అనీష్ కురువిల్లా దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్. హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ 8 భాగాల సిరీస్ ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఉంది, మరి సిరీస్ ఎలా ఉందో చూద్దాం..!! నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ శాస్త్రవేత్త విశ్వక్ సేన్ (అశుతోష్ రాణా) ఓ ఫ్లైట్ యాక్సిడెంట్ లో మరణించడం అనే సన్నివేశంతో సిరీస్ మొదటి భాగం మొదలయింది. అతడి ఆస్తి దాదాపు 24,000 కోట్ల రూపాయలు. దానిని తనకు రక్త సంబంధీకులు అయిన వారందరికీ సమానంగా పంచాలని వీలునామా రాస్తాడు. కానీ అందుకోసం విశ్వక్ సేన్ స్వంతగా నిర్మించుకున్న నికోబార్ దీవులలో ఉన్న మోక్ష ఐలాండ్ లో వారం రోజులపాటు ఉండాలని షరతు పెడతాడు. ఈ నిబంధనకు అంగీకరించిన విశ్వక్ సేన్ కుటుంబ సభ్యులైన వారందరూ విశ్వక్ రాసిన ఉత్తరాల ద్వారా మోక్ష ఐలాండ్ లో నివసించడానికి సన్నద్ధమవుతారు. ఆలా ఒప్పుకుని ఐలాండ్ కి వచ్చిన తరుణంలో వారిలో ఒక్కొక్కరు అనుకోకుండా కనిపించకుండా పోతుంటారు. అసలు మోక్ష ఐలాండ్ లో అందరూ వారం రోజులు ఉండాలని విశ్వక్ సేన్ ఎందుకు నిబంధన విధించాడు? ఆ ఐలాండ్ లో ఏం జరిగింది? వారందరు ఎందుకు కనపడకుండా పోతున్నారు ? అనే చాలా ప్రశ్నలకు సమాధానమే ఈ (The Mystery Of Moksha Island ) వెబ్ సిరీస్
పాత్రల అభినయం: సంకలనం రెండవ భాగం నుండి విక్కీ (నందు) పాత్ర చెప్పుకోతగినది. తన అక్కను వెతుక్కునే తమ్ముడిగా మంచి నటన కనబరిచాడు. ప్రియా ఆనంద్ కూడా మంచి నటన కనబరించింది. తేజస్వీ మడివాడ, పావని సహనటుల పాత్రల్లో పర్వాలేదనిపించుకున్నారు. అక్షర గౌడ ఈ సిరీస్ కు గ్లామర్ అద్దడానికి ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలించలేదనే చెప్పవచ్చు. మిగిలిన వారిలో రోషన్ కనకాల (రాజీవ్ కనకాల-సుమల కుమారుడు) సరి అయిన నటన కనబరిచారు. ఒక సెన్సిటివ్ (గే-మానసిక ప్రతినాయకుడు) క్యారెక్టర్ ను బాగా పోషించాడు.
సాంకేతికవర్గం పనితీరు: నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సిరీస్ మొత్తం ఒక లొకేషన్ లోనే సాగినప్పటికీ, ప్రదేశాలు చిత్రీకరణ పై ప్రేక్షకుడికి విసుగు పుట్టించకుండా జాగ్రత్తపడ్డాడు. ముఖ్యంగా, సముద్ర తీర ప్రాంత సన్నివేశాలను బాగా చూపించాడు. ఈ సంకలనానికి కళానైపుణ్యం కూడా ఓ కలిసివచ్చిన అంశం అయ్యింది. తక్కువ ఖర్చులో మంచి ఫలితాన్ని ప్రేక్షకులకి అందించారు. శోధన కేంద్రం (ల్యాబ్) సెటప్ సహజంగా వచ్చింది. శక్తికాంత్ కార్తీక్ నేపథ్య సంగీతం పర్వాలేదు అనిపించుకొంది.

దర్శకుడు అనీష్ కురువిల్లా సిరీస్ ను రాసుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా, మనుషులు తమకు సమస్య ఎదురైనప్పుడు, వారి వారి నిజ స్వరూపాలను బయటపెట్టుకునే విధానాన్ని చాలా పాత్రల ద్వారా చూపించాడు. అదే విధంగా “స్వార్థం, ఆశ, కామం, క్రోధం” వంటి నిగ్రహించుకోలేని భావనల వల్ల మనిషి ఎంత దిగజారుతాడు? ఎంతకి తెగిస్తాడు? వంటి అంశాలను తెరపై చూపించిన విధానం కూడా బాగుంది. 
అయితే, పాత్రధారులు మరీ ఎక్కువ మంది అయిపోవడంతో అన్ని పాత్రలకి సరిగా పూర్తి న్యాయం  చేయటానికి కుదరలేదు. ఈ కారణాలు వలన అనీష్ కురువిల్లా దర్శకుడిగా కంటే కథకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడెమో. కాస్త నిర్దిష్టమైన పాత్రలను కధలో రాసి ఉంటే మాత్రం సిరీస్ ఇంకా బాగా ఆకట్టుకునేది అనిపించింది. అశుతోష్ రాణా (విశ్వక్సేన్) పాత్రను నిర్మించిన తీరు బావున్నప్పటికీ, మిగతా కీలకపాత్రధారులైన నందు, ప్రియ ఆనంద్ పాత్రలు కూడా ఇంకాస్త చక్కగా నిర్మించి ఉంటే బాగుండేది.

నటీనటులు : అశుతోష్ రానా, తేజస్వి మడివాడ, నందు, ప్రియా ఆనంద్, అక్షయగౌడ , భానుచందర్, రోషన్ కనకాల, పావనిరెడ్డి, సోనియా అగర్వాల్(7/జి ఫేం)
దర్శకత్వం
అనీష్ కురువిళ్ళ
రచన : సంజీవ్ రాయ్, ప్రశాంత్ వర్మ 
ఛాయాగ్రహణం: నవీన్ యాదవ్ 
-- అవ్యజ్ (శంకర్) 2.7**/5*****

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog