మిస్ యు - అమెజాన్ ప్రైమ్
సిద్ధార్థ్ హీరోగా, అషిక రంగనాథన్ హీరోయిన్ గా తెలుగు - తమిళ భాషల్లో నిర్మితమైన సినిమా 'మిస్ యూ'. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన థియేటర్లలో విడుదలయి, శృంగార హాస్య సంయుక్తంగా రూపొందిన ఈ చిత్రం, ఈ నెల 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్షింపబడుతోంది.
కధా కమామీషు :
చెన్నైలో ఫ్యామిలీతో ఉంటున్న వాసు (సిద్ధార్థ్)కి సినిమా డైరెక్టర్ కావాలనేది కోరిక. ఆ ప్రయత్నంలో ఉండే వాసూకి నిజాయితీతో పాటు కాస్త ఆవేశం కూడా ఎక్కువే. ఆ ఆవేశంతోనే మంత్రి చిరాయుడు (శరత్ లోహితస్య) కొడుకుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవలసి వస్తుంది. దాంతో ఆ మంత్రి తన అనుచరులతో వాసూకి యాక్సిడెంట్ చేయిస్తాడు.
ఆ యాక్సిడెంట్ ద్వారా రెండు సంవత్సరాలు గతం మర్చిపోయిన సిద్ధార్ధ్ తన ఉద్యోగ ప్రయత్నం కోసం బెంగళూరు వెళుతూ స్టేషన్ లో తనకి పరిచయం అయిన బాబీ (కరుణాకరన్)తో స్నేహం ఏర్పడి అతని గదిలోనే విడిది చేయటం జరుగుతుంది. బాబీకి వున్న కాఫీ షాప్ లో సరదాగా పని చేస్తుంటాడు. అక్కడే ఆషిక (సుబ్బలక్ష్మి) ఎదురు పడుతుంది. మొదటి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. తరువాత తనకి ప్రేమని వ్యక్తం చేసి ఒప్పుకోకపోవడంతో చెన్నైకి వెళ్లిన వాసుకి కొన్ని నిజాలు తెలుస్తాయి. అక్కడి నుండి కధ మొదలు అవుతుంది. అక్కడి నుండి అసలు కథ ఏమి జరిగింది వాసుకి తెలిసిన నిజాలు ఏమిటి అనేది చిత్ర కధాంశం.
ఎలా వుందంటే:
రాజశేఖర్ దర్శకత్వంలో కాస్త ప్రేమ, కాస్త భావోద్వేగం, అక్కడక్కడా హాస్యంతో కలుపుకుంటూ మలుచుకుంటూ వచ్చిన చిత్రం. ప్రేమతో పాటు కాస్త ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలిపి భావోద్వేగాలకు పెద్దపీట వేశాడనే చెప్పాలి. నాయికా నాయికల ప్రేమ కధ ప్రథమార్ధం మరియు, గతం తెలిసిన తరువాత జరిగే కథగా ద్వితీయార్ధం తెరపైకి వచ్చాయి. ప్రేక్షకుడి అంచనాలకి అందని విధంగా కథను అల్లుకున్న తీరు ఒకింత బాగుందనే చెప్పాలి.
చిత్రంలో నాయికా నాయికల కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలు ఈ చిత్ర కథలో కీలకమైనవిగా కనిపిస్తాయి. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతాయి. చిత్రంలో మంత్రి మరియు బాగా పలుకుబడి ఉన్న ప్రతినాయకుడు అయినప్పటికీ అవసరమైనప్పుడే ఆ పాత్రను తెరపైకి తీసుకుని రావడం కూడా బాగుంది. సుబ్బలక్ష్మి కి , ఆమె తండ్రికి మధ్య గల భావోద్వేగ సన్నివేశాలు దర్శకుడు బాగా రచించాడు.
కధ ప్రధమంలో నిదానంగా మొదలయినప్పటికి తరువాత ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఆషిక నటన మరియు సిద్దార్ధ్ ల నటన బావుంటుంది. కధలో పూర్తిగా కాకపోయినా కాస్త కొత్తదనం కనిపిస్తుంది.
ఆస్తులు :
కధలో కొత్తదనం, చెప్పిన తీరు, సిద్దార్ధ్, ఆషికల నటన కలిపి బాగానే ఉన్నాయి, ఫోటోగ్రఫి పరవాలేదు అనిపించాయి.
కుదుపులు :
కధకి సంబంధం లేదు అనిపించే టైటిల్, సున్నిత భావాలను పలికించినప్పటికీ ఆషిక అందం ఇంకొంచం వండి వడ్డించాల్సింది, ఉర్రూతలూగించే పాటలు లేకపోవడం.
నటీనటులు : సిద్దార్థ్, ఆషిక రంగనాధన్, పోన్ వనన్, జయ ప్రకాష్, తదితర నటులు
దర్శకుడు : రాజశేఖర్
సంగీతం : గిబ్రాన్
బ్యానర్ : 7 మైల్స్ పర్ సెకండ్
0 కామెంట్‌లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.