పరదా
స్త్రీ పాత్రలకి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న తెలుగు సినిమాల జాబితాలో కొత్తగా చేరింది పరదా (Paradhaa). మహిళ స్వరాన్ని, సంప్రదాయాల బంధనాల్ని, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటాన్ని చూపించే ఈ సినిమా ఇటీవలే ఓటిటి వేదిక అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది.కథాకమామీషు :
ఆంధ్రప్రదేశ్ లోని పడతీ గ్రామం. అక్కడ శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆచారం ఉంది – మహిళలు ఎప్పటికప్పుడు ముఖాన్ని ముసుగుతో కప్పుకోవాలి. దానికి ఓ పూర్వ కథ జ్వాలమ్మ అనే ఓ రాణి పరదా లేని స్థితిలో కొంతమంది దుర్మార్గుల వలన అత్యాచారానికి గురై, ఆ పోరాటంలో ప్రాణాలు కోల్పోతుంది. దానికి కారణం పరదా లేకపోవడం అని, ఆమె శాపం వల్లనే కడుపుతో ఉన్న ఆడవాళ్ళ పిల్లలు చనిపోతారని మూఢంగా విశ్వసిస్తారు. ఇంకా ఆ గ్రామంలో ఉండే స్త్రీ పుష్పవతి అయినప్పటినుండి పెళ్లి వరకు భర్త, కుటుంబ సభ్యులు తప్ప ఎవరు చూడద్దని భట్వా జారీ చేస్తారు.
గడిచిన దశాబ్దాల నుండి అదే నమ్మకాన్ని ఆచరిస్తున్న ఆ గ్రామంలో ఉండే సుబ్బు (అనుపమ పరమేశ్వరన్), ఒకరోజు పొలంలో అనుకోకుండా ఆ ముసుగు తప్పిపోవడం వల్ల తన జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. ఆ ఫోటో ఒక మేగజైన్ కవర్ పేజీపై వెలిగిపోవడంతో, గ్రామం మొత్తం అలా పెళ్ళికి ముందే యువతి మొఖాన్ని ప్రపంచం ఆ మ్యాగజైన్ ద్వారా చూడటం అవమానంగా భావిస్తుంది. సుబ్బు నిశ్చితార్థం రద్దవుతుంది, తను అవమానం ఎదుర్కొంటుంది.
ఇలాంటి సమయంలో ఆమెకు తోడుగా నిలుస్తుంది రత్నా (సంగీత). వారిద్దరూ ధర్మశాల దిశగా బయలుదేరుతారు. మార్గమధ్యలో కలుస్తుంది అమిష్తా (దర్షనా రాజేంద్రన్) – ఒక ఆధునిక, స్వతంత్ర భావాల మహిళ. ముగ్గురి ప్రయాణం కేవలం ఒక ప్రాంతం వైపు కాదు, జీవితాన్ని కొత్త కోణంలో చూసే ఆత్మావిష్కరణ ప్రయాణం.
విశ్లేషణ :
దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ కథని సున్నితంగా నడిపించారు. సంప్రదాయ బంధనాలు, మహిళల వ్యక్తిగత స్వాతంత్ర్యం, సమాజం నుంచి ఎదురయ్యే వ్యతిరేకత – అన్నీ సహజంగా మిళితమయ్యాయి.
అనుపమ పరమేశ్వరన్ నటన సినిమాకి బలం. ఆమె పాత్రలో కనిపించే భయం, అవమానం, తర్వాత వచ్చే ధైర్యం అన్నీ సహజంగా ఉన్నాయి.
దర్షన రాజేంద్రన్ పాత్ర కొత్తదనాన్ని తెచ్చింది. ఆమె వ్యక్తిత్వంలో ఉన్న స్వేచ్ఛ, పోరాటం కథకి బలం ఇచ్చాయి. సంగీత నటన కూడా బాగానే అనిపించింది.
సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ధర్మశాల వంటి లొకేషన్లు సినిమాకి అందాన్ని తెచ్చిపెట్టాయి. అయితే, మధ్య భాగంలో కథ నిదానంగా సాగడం వల్ల ప్రేక్షకుడు కాస్త ఓపిక పట్టాల్సి వస్తుంది.
పరదా (Paradhaa) ఒక సందేశాత్మకమైన సినిమా. మహిళల స్వరాన్ని వినిపించేలా, సంప్రదాయాల బంధనాలపై ప్రశ్నలు వేసేలా రూపొందింది. నెమ్మదిగా సాగే కథనం ఉన్నా, ఓటిటి వేదికపై ఒకసారి చూడదగిన సినిమా.
లోతైన ప్రశ్నలు - సంధించే బాణాలు
- స్వేచ్ఛ - విచ్ఛలవిడి తనంగా మారుతుందా? అది గుర్తింపుకి నోచుకోవడం లేదా?
- స్త్రీ ధరించే బట్టల్లోనే అశ్లీలత లేదు, చూసే చూపులో ఉంది అని వాదించే వారి వాదన సరియైనది అని నిరూపించటానికి దర్శకుడు చేసిన ప్రయత్నం కేవలం మహిళల మనోభావాలను బాధపెట్టకూడదు, మహిళా ప్రేక్షక సంఖ్య వ్యతిరేకం రావద్దు అనేలా తీసిన ఆలోచనా ?
- పాతతరానికి తెలియని అశ్లీలత, జాగ్రత్త, స్త్రీకి తన దేహం పైన ఉన్న అవగాహన ఇప్పటి తరానికి మాత్రమే చాలా ఎక్కువగా ఉందంటారా?
- అవసరానికి చదువు, పోషణకు వుద్యోగం అనే స్వేచ్చ పక్కదారి పట్టిందా ?
- సంపాదనే ధ్యేయంగా కనీస అవసరాలనే విలాసాలకు చేరువై అవే కనీస కోరికలయ్యాయా?
- చాలామంది ఉదహరించే చరిత్రలోని వీర నారీశక్తి భర్తలని లేదా మగవారిని పక్కకి నెట్టి తమ ఆధిక్యం చూపించారా/ వేరే దారిలేని తప్పని పరిస్థితుల్లో విజృంభించిందా?
- ఓ క్షేత్రం (భారత స్త్రీ) సరియైన ఆచ్ఛాదన లేకుండా, ప్రహరీలు, కంచె లేని భూమిలా అందరికి అందుబాటులో ఉంటే, అందులో ప్రజలు చేసే వికృత చేష్టలకి (ఒకరు మూత్రం విసర్జిస్తె, ఇంకొరు మలం, మరొకరు మాలిన్యం వేస్తే, వివిధ జంతువుల కళేబరాలు, సేద తీర్చుకునేవి కూడా ఉన్నప్పటికీ ) బాధ్యత యజమానిది కాదు, అలా చేసే వారిది అని వాదించటం సబబేనా?
- స్త్రీ అంటే శక్తి ( ట్రాన్స్ ఫార్మర్ ), ప్రకృతి, దేవత - అనే విషయాన్ని అంగీకరించే స్త్రీతత్వం మరి ఆ శక్తి- ప్రకృతిని సరిగా వాడుకోవాలి, సరైన మార్గంలో ప్రయాణించటానికి ఓ మాధ్యమం (పురుషుడు కాని, సరిదిద్దుతుండె తండ్రి తాత, స్నేహితుడు ) ఉండాలి అనే నిజాన్ని ఎందుకు గ్రహించలేకపోతుందో?
- స్త్రీ అంటే గౌరవం, యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే ... అనుకుంటే పూజించబడేలా ఉండాల్సిన బాధ్యత, గౌరవించేలా నడుచుకోవడం అనేది తమ సొంతం అని తెలుసుకునేదెప్పుడు, నిరూపణ జరిగేదెప్పుడు?ఎవరైనా గౌరవించబడాలంటే - గౌరవించబడేలా ప్రవర్తించడం కర్తవ్యమేగా? దానిని అంగీకరించాల్సిందేగా?
- ఆడదాని మనసు సముద్రమంత లోతైనది, అది గ్రహించడంలో విఫలమవుతున్నారని వాపోయే సందర్భాలలో, ఆ సముద్రానికి అలలున్నప్పటికీ అవి తీరం వరకే వచ్చి ఆగటం సృష్టి ధర్మం. ఎందుకంటే అందరం అందంగా ఉండే పకృతినే ప్రేమిస్తాం కానీ సునామీ వంటి ప్రకృతి ప్రళయాన్నీ, వైపరిత్యాన్ని కాదుగా?😊
లోతైన విభిన్న కోణం
- ఓ సమాజంలోని ఆ నలుగురు తాటి చెట్టు కింద నిలబడినా తాగేది తెల్లని పాలే అని నమ్మించాలి అంటే ఆ నమ్మకం అనేది ఆ నలుగురి వ్యక్తిత్వం తెలిసిన దగ్గర వారికే కానీ ప్రపంచానికి అందే సందేశం మాత్రం అది కల్లు అనే విషమే. మరి అందరూ ఆ విషయం నమ్మ టానికి చాలా సమయం పట్టచ్చు , మరి ఈ లోపల ఆ నమ్మకాన్ని మోసంతో వమ్ము చేసే వాళ్ళని ఎలా ఆపగలం?
- బట్టల్లో అశ్లీలత లేదు, స్త్రీని చూసే దృష్టి మారాలి అని, చిన్న పిల్లలపై , ముసలి వాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలకు ఏ బట్టలు, ఏ అశ్లీలత కారణం అవుతుంది, అనే వాదనా లేకపోలేదు. అదే కట్టు బొట్టులో ఏమి లేకపోతే, ఓ పరిచయం లేని ఆడ-మగ మొదటి చూపులో ఒకరంటే ఒకరికి కలిగే అభిప్రాయం మనసుని ఆధారంగానా లేక ఆహార్యం ఆధారంగానా అని ఎందుకు ఆలోచించరు?
- స్త్రీ మానానికి హాని చేసేవాల్లని వక్ర బుద్డితో చూసే వాళ్ళని నడిరోడ్డుపైన బహిరంగంగా ఉరిదీయాలి అప్పుడే పగ తీరుతుంది, న్యాయం జరుగుతుంది. ఇది శాశ్వత పరిష్కారం అవుతుందా?
ఆస్తులు :
- అనుపమ పరమేశ్వరన్ సహజమైన నటన
- దర్షన రాజేంద్రన్ కొత్తదనం తెచ్చిన పాత్ర
- తెలుగు గ్రామీణ వాతావరణం, ధర్మశాల విజువల్స్ బావున్నాయి
- సంగీతం, ఛాయాగ్రహణం, టెక్నికల్ పనితనం మెప్పించాయి
- మహిళా సాధికారత అనే స్పష్టమైన సందేశం ఇచ్చిన చిత్రాలలో చేరిన మరో చిత్రం
కుదుపులు
- నిదానంగా సాగే కథనం – ముఖ్యంగా మధ్య భాగంలో ఆసక్తి తగ్గుతుంది
- కొన్ని సంఘటనలు అతిశయంగా అనిపిస్తాయి
- సైడ్ క్యారెక్టర్లను మరింతగా వివరించి ఉంటే బాగుండేది
- క్లైమాక్స్ ఊహించినట్లుగానే ఉంది
ఓ.టి.టి. ప్లాట్ట్ ఫార్మ్ : అమెజాన్ ప్రైమ్
నటీనటులు : సంగీత, అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్ర
దర్శకులు : ప్రవీణ్ కండ్రేగుల
రచయిత : పూజిత శ్రీకంటి, ప్రహస్ బొప్పన
సంగీతం : గోపి సుందర్
2 కామెంట్‌లు
చాలా సునిశితంగా వివరంగా విస్తారంగా రివ్యూ రాశారు - గౌతమ్ కశ్యప్
రిప్లయితొలగించండిమీ విలువైన సమయం వెచ్చించి చదివి , మీ అభిప్రాయం తెలిపినందులకు ధన్యవాదములండీ...
తొలగించండిమీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.