Who am I by the way / ఇంతకీ నేనెవరినీ

అందరికి చాలాసార్లు పరిచయమైన అనుభవించిన పరిస్థితుల పైన  ఓ మనసు మాట్లాడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి వచ్చిన గద్యం 
పవిత్ర సంగమంలో  కణమునై లేత పొత్తిళ్ళలో పురుడుపోసుకున్నా !
అందరిలో ఉంటూనే అందరితో ఉంటాను ఐనా అపుడప్పుడూ నేను ఒంటరినే !!
చిట్టిపాప మోములో నవ్వునైనా, ఆడే పాడే అల్లరినైనా నాకు నేనే ఓ గమ్యమెరుగని ప్రయాణికుడిని,
అలుపెరుగని బాటసారిని !!!

వయసుకొచ్చి పువ్వునైనా, ఎదను తడిమే లేలేత తుంటరి సిగ్గునైనా !
యవ్వనంలో మరిపించే ' ప్రేమ' నైనా, ప్రాణంలా ప్రేమనిచ్చే ప్రియుడినైనా !!
కొందరికి మరువని జ్ఞాపకాన్నిచ్చి , ఇంకొందరికి చెరగని కన్నీటి జ్ఞాపకంలా మారుతున్నా- అన్నిటా నాకు నేనే ఒంటరి !!!

కవుల చేతి కలంనుండి జాలువారే సిరాక్షర క్రమాన్నై, పాఠకుల ఎదుట సజీవ భావాన్నైనా !
కొందరికి పిచ్చివాడ్ని, ఇంకొందరికి నచ్చినవాడ్నిచాలామందికి అర్ధంకాని ప్రశ్ననైనా !!
తప్పటడుగులో తప్పునై గెలిచానని విర్రవీగినా , భావమెరిగి నీతో నడిచానని సిగ్గుపడుతున్నా... 
హు.. ఉమ్మనీరు త్రాగానేమో, ప్రేగుతుంచి వచ్చానేమో మరి అపుడప్పుడూ రక్తంతో తడుస్తోన్నా నాకు నేనే ఒంటరి !!!

కష్టమొచ్చి కుదుపుతున్నా, చేవలేక ఓడుతున్నా , చివరికి చితిని చేరి కాలుతున్నా...నా గమనం ఆగదు...
గమ్యం తీరదు... ఇంతకీ నేనేవరిననేగా .... 
- -
నీలో ఉంటూ.. నీ తోనే నడిచే - నీ లేత మనసుని !!


-- 
శంకర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog