Aadipurush / ఆదిపురుష్



ఆదిపురుష్ చిత్రం 

ధర్మమైన మానవ జాతి నిర్మాణానికి ఆదిపురుషుడుగా కీర్తికెక్కిన శ్రీ రాముని చరిత్ర మూలకధగ తీసుకొని తెరకెక్కిన ఓం రౌత్ దర్శకత్వంలో హిందీతో పాటు 5 భాషలలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన చిత్రం ఆదిపురుష్. ఆరడుగుల ఆ ఆజానుబాహుడు శ్రీరాముడిని ఈ చిత్రంలో ప్రభాస్ ఆహార్యంలో సరిగ్గా చూడవచ్చు. అగ్నిరూపిణి, భూదేవి ముద్దుబిడ్డ, జనకరాజు తనయ అందాల జానకి పాత్రలో కృతిసనన్ కొంచం తేలిపోయినట్టే ఉంటుంది. ఆహార్యంలో చాలా మెళకువలు తెలియపరచాల్సి ఉంది. అక్కడక్కడా పేరు చెప్పకపోతే పాత్రలని గుర్తుపట్టడం కూడా కష్టం అనిపిస్తాయి. కేవలం ఓ 10-15 నటులతో కధంతా నడిపేసాడు ఓం రౌత్. చిత్రం మొత్తం గ్రాఫిక్స్ మాయాజాలంతో నడుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం బాగా కష్టపడినప్పటికీ నాణ్యత బాగానే ఉన్న ఎక్కడో చీకట్లో జరుగుతున్న అనుభూతి ఉంటుంది. అవసరమైన చోటైనా కాస్త నిజమైన సహజమైన ప్రకృతిని, పరిసరాల్ని వాడుకొని ఉంటె బావుండేదేమో అనిపించింది. చిత్రం మొత్తం కృత్రిమంగా నెట్టుకొచ్చినట్లుంది. ఇక కధ విషయానికొస్తే రామాయణాన్ని ఇతివృత్తంగా తీసుకొన్నపటికి కొద్డి మార్పులు చేర్పులు చేసాము అని ముందుగానే టైటిల్స్లో ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసిన ఓం రౌత్. వనవాస ఘట్టంతో కధ ప్రారంభం అవుతుంది. అందరికి బాగా పరిచయమైన లక్ష్మణుడి పాత్రని శేషుగ పేరు మార్చి ప్రయోగం చేశాడేమో అనిపించింది. సూర్ఫణఖ ముక్కు చెవులు కత్తిరించే సన్నివేశం కధలో కలిసిపోకుండా జత పరిచినట్టుంది. సీతాపహరణం సన్నివేశంలో పుష్పక విమానం బదులుగా ఆధునికంగా, రావణాసురుడి వాహనంగా వింత జంతువుని పెట్టడం ఎబ్బెట్టుగా ఉంది.హనుమ - శ్రీరాముల కలయిక ఓ భావోద్వేగసన్నివేశం, అది ఇంకా బాగా చిత్రీకరించవచ్చు. హనుమను పొగిడినప్ప్పుడు తనశక్తి గురించి తెలియచెప్పే వీరత్వాన్నీ , రావణాసురుడు సైఫ్ అలీ ఖాన్ ని దశకంఠుడిగా చూపించటానికి చేసిన యత్నం కూడా ఆర్టిఫిషల్ గా ఉంటుంది. శబరి తన ఎంగిలి పండ్లను రామునికి ఇచ్చిన ఘట్టం చేర్చినప్పటికీ తదుపరి శబరీ స్వయంగా దహనమవుతూ సుగ్రీవుడిని కలవమని చెప్పటం కధని కొనసాగింపు సీతాపహరణం సమయంలో జానకి జారవిడిచిన ఆభరణాలు అనే అంశాన్ని చిన్న ముత్యపు లాంటి రత్నంతో పోల్చి క్లుప్తంగా ముగించేశారు. వాలి వధ సన్నివేశంలో ధర్మాన్ని కాపాడటం కోసమే అన్న ఘటనగా మార్పు చేసారు. చిత్రం మొత్తంలో ఏ సన్నివేశాలలోనూ ప్రేక్షకుడికి రాచరికం మేడలు, కోటలు సైన్యం వంటి ఆనవాళ్లు కనిపించవు అన్నిటిని గ్రాఫిక్స్ మాయాజాలంలో కొత్త ప్రపంచంగా మార్చేశారు. లక్ష్మణుడు మూర్ఛనొందాక సంజీవని పర్వతం తెచ్చిన హనుమ ఘటనలో ఆయనని ఓ పసరు బట్టీ నుండి మేల్కొలపడం అందుకు సాయం చేసిన వైద్యురాలు విభీషణుని భార్య లేదా వేరే ఎవరైనానా అనేది చెప్పలేదు. ఐతిహాసిక శ్రీరామ చరిత్రలో మండోదరి నిత్య సుమంగళిని. ఆమెను రావణాసురిడి యుద్ధ ఆఖరి ఘట్టంలో విధవ వేషధారణలో కనిపింపచేయటం హాస్యాస్పదమైతే, కనీసం చివరిలో అయినా రాముడు మండోదరికి అభయమిచ్చే సన్నివేశం చేర్చినట్లయితే బావుండేది. రావణాసురుని ప్రాణం బొడ్డులో ఉంది "ఇంటిగుట్టు లంకకు చేటు" అని చెప్పే సన్నివేశం దాటవేసి రావణుని మరణాన్ని అలా చూపించడం అసంపూర్ణంగా ఉంటుంది. యుద్ధ ఘటనలు మాత్రం గ్రాఫిక్స్ తో బాగా చిత్రీకరించారు. అవన్నీ 3డి గేమ్ లా ఆకట్టుకుంటాయి. ఇలా వనవాసంతో మొదలైన కధ రావణాసుర వధతో ముగించేశారు. ఆఖరు యుద్దానికి ముందు దశరధుని పాత్ర, రాముని పితృవాక్య పరిపాలన దక్షతని ఓ మాటలో తేల్చిపడేసారు. ఇక్కడ కైక వరం అడిగిన తరువాత శ్రీరాముడు అంతఃపురంలో రాజుగా ఉన్నప్పటికీ  ఆభరణాలు లేకుండా సాదా వస్త్రధారణలో ప్రభాస్ వేషధారణని జీర్ణం చేసుకోలేకపోయారు ప్రేక్షకులు. మొత్తానికి ఆదిపురుషుడు శ్రీరాముడు మన అందరి మనస్సులో ఉన్న విధంగా పూర్తిగా కాకపోయినా మార్పులు చేర్పులతో రామాయణమే అనేలా అనుభూతిని అందించారు ఓంరౌత్. తనకున్న రకరకాల పుస్తక ఇతిహాసిక పరిజ్ఞానానికి పూర్తి ఆధునికతని జోడించి గ్రాఫిక్స్ మాయాజాలంతో ఆహా అనిపించి పాతతరం మనస్సులో ముద్రించుకున్న రాముడుని భిన్నంగా చూపించినా కొత్తగా రాబోయే తరాలకు రామాయణం ఇలా జరిగిందట అనేలా కధా జ్ఞాపకాన్ని బాగానే మిగిల్చారు. జై శ్రీరామ్ పాట, సీతారాముల ప్రణయ పాట మెలోడీ ప్రియులని ఆకట్టుకుంటాయి. యుద్ధ సన్నివేశాలు వీరత్వం మాస్ ప్రేక్షకులని బాగా హత్తుకొంటుంది.డబ్బింగ్ కొంచం అటు ఇటుగా తడబడింది. హిందీ తారాగణం ఉండడం అందరు తెలుగుని పలకలేకపోవడం కొంత కనిపించకుండా కవర్ చేసినా డబ్బింగ్ కి, సంభాషణలకు చేదు మరకని అంటించాయి. 
జై శ్రీరామ్. శుభం.
-- అవ్యజ్ (శంకర్)


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog