Sarvam shaktimayam /సర్వం శక్తిమయం


సర్వం శక్తిమయం /  Sarvam shaktimayam

శ్రీమాత్రే నమః 

ఈ సిరీస్ గురించి నలుగురికి తెలియాలి అని రాయటం జరిగింది. కమర్షియల్ చిత్రాల గురించి రివ్యూ రాయడం చాలామందికి ఓ ఆనవాయితీ. కానీ ఇలాంటి చిత్రాలు కూడా తీస్తుండాలి, వాటిని ప్రేక్షకులు ఆదరించాలి. ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు ఇలాంటి ప్రయత్నాలు అరుదుగా చేస్తూ ఉంటారు. సమాజాన్ని చాలా ప్రభావితం చేసే బలమైన మీడియా వెండితెర ఐతే, ఇంటింటికి వెళ్లి ప్రభావితం చేసే మాధ్యమం బుల్లితెర. అలాంటి బుల్లితెర కి అనుసంధానం అయి ఈ మధ్య వస్తున్న మరో మాధ్యమం ఓ.టి.టి. అలాంటి ఒక ఓ.టి.టి. ఆహాలో , జీ 5లో ప్రదర్శితమవుతున్న వెబ్ సిరీస్ ఈ సర్వం శక్తిమయం. క్రియేటర్ బి.వి. ఎస్.రవి గారు చేసిన ప్రయత్నం అభినందనీయం.కధా ముఖ్యాంశంగా, సమస్యలో ఉన్న ఓ వ్యాపార కుటుంబం ప్రియమణి - సంజయసూరి వాళ్ళది, దానికి అనుసంధానించి సంకల్ప దీక్ష, భగవద్గీతలోని ముఖ్యమైన వాటిని సందర్భాలకు జోడించి, అష్టాదశ శక్తిపీఠాల యాత్రను కథలో భాగంగా  ప్రేక్షుకులకు కూడా దర్శింప చేస్తూ సాగుతుంది. అయిష్టంగా మొదలుపెట్టిన శక్తిపీఠాల యాత్ర అలంపురం నుండి మొదలు పెట్టి ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో యాత్రని కలుపుకుంటూ లంకాయాం శాంకరి దేవితో యాత్ర ముగుస్తుంది. ఒక్కో శక్తిపీఠం నుండి మట్టిని తీసుకొని రావడం అనే సంకల్పం తో మొదలుపెట్టి, యాత్ర పూర్తయ్యే వరకు రచయితతో ప్రయాణం, ఆ నాస్తిక రచయిత ప్రశ్నిస్తున్న ప్రశ్నల నుండి దైవం మీద భక్తి , మానసిక ప్రశాంతతో పాటు జీవితంలో మనిషికి నిజంగా కావాల్సింది ఏమిటో తెలుసుకుంటారు ఆ కుటుంబం, నాస్తికుడు కూడా. కుటుంబ సభ్యులలో ఒక్కొరిది ఒక్కో సమస్య, అవి ఒక్కో శక్తిపీఠ దర్శనంతో ఒక్కో చిక్కుముడి విడిపోతున్న అనుభవం జరుగుతుంటుంది. సత్యదేవ్ తో 47 days సినిమా చేసిన ప్రదీప్ దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, బాగానే ఉన్నా, భాషానుకరణ (డబ్బింగ్), సంభాషణలు కొంచం మెరుగు పరుచుకుని ఉంటే బావుండు అనిపిస్తుంది వేరే మాతృకలో ఉన్న వారికి. పాత్రల నటన, ఎమోషన్స్ కూడా ఇంకొంచం బాగా పండించవచ్చు. సిరీస్ మొత్తం మీద సుబ్బరాజు పాత్ర నిడివి కొంచమే ఉంటుంది.తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి దూరం అయినట్లుగా ఉంది. సాంకేతిక వర్గం కృషి మధ్యమంగా కనిపించింది . ముఖ్యంగా శక్తిపీఠ యాత్రల విశిష్టత కనిపిస్తుంది. ఇంటి నుండి అష్టాదశ శక్తిపీఠ క్షేత్రాల దర్శనం చేసిన అనుభూతిని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నంలో విజయం సాధించారు. 

దర్శకత్వం : ప్రదీప్ మద్దాలి 

నటన : ప్రియమణి, ఆశ్లేష ఠాకూర్,  సంజయ్ సూరి, అభయ్ సింహ,సమీర్ సోని (నాస్తిక పుస్తక రచయిత), సుబ్బరాజు, Emily R. Acland
నిర్మాతలు : విజయ్ చద్దా , ప్రియా శర్మ, కౌముది 
సంగీతం,పాటలు : కె.ఎస్. అభిషేక్ , సమర్ద్ శ్రీనివాసన్ 
-- 
అవ్యజ్ (శంకర్)


కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు

మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.

Search This Blog