Acharya / లాహే లాహే కొండలరాజు బంగరు కొండ పాట - నా మాట

రచన : శ్రీ రామజోగయ్య శాస్త్రి
చిత్రం : ఆచార్య
సంగీతం : మణిశర్మ


మొదటగా ఇంతటి అద్భుతమైన పాటను రాసిన శ్రీ రామ జోగయ్య శాస్త్రి గారికి వందనాలు. ఆది దంపతుల మధ్య జరిగే సరస విరస సల్లాపాన్ని కొండజాతి వాళ్ళ దైవంగా కొలిచే దేవిని వాళ్ళ యాసలో (మంగళగౌరి లేదా మాతంగి) మానవాళికి అనునయించి రాయడం ఓ కొత్త ప్రయోగమనే చెప్పాలి. ఆ ఆలోచనకి సుతరామూ వేలెత్తి చూపించనవసరం లేదు. కాకపొతే చివర్లోనే విపరీతార్ధ ముగింపు ఎందుకు ఇచ్చారో తెలియడం లేదు. ఇప్పడు ఒక్కో చరణం అర్ధం క్లుప్తంగా చర్చిద్దాం..
లాహే లాహే లాహే లాహే లాహే లాహే - లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే...
1-పల్లవి :-
కొండలరాజు బంగరు కొండ… కొండా జాతికి అండా దండా - మద్దే రాతిరి లేచి… మంగళ గౌరీ మల్లెలు కోసిందే - ఆటిని మాలలు కడతా… మంచు కొండల సామిని తలసిందే

--: కొండలరాజు బంగారుకొండ - కొండలరాజైన శివయ్య బంగారుకొండ అని ముద్దుగా పిలిచే కొండా జాతికి అండా దండా :- కొండ జాతికి అండ దండగా ఉండేది, మద్దే రాతిరి లేచి - మంగళగౌరి మల్లెలు కోసిందే :- అర్ధరాత్రి గౌరి ( పార్వతి ) నిద్దర లేచి మల్లెపూలు కోసిందట. ఆటిని మాలలు కడతా… మంచు కొండల సామిని తలసిందే : మంచు కొండల సామైన ఈశ్వరుడుని తలచుకొంటూ మాలగా చేసి చూసిందిట ఆ కోసిన మల్లెలన్ని

లాహే లాహే లాహే లాహే లాహే లాహే - లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
1. చరణం -
మెళ్ళో మెలికల నాగుల దండ - వలపుల వేడికి ఎగిరి పడంగా - ఒంటి యిబూది జలజల రాలి పడంగా-సాంబడు కదిలిండే - అమ్మ పిలుపుకు సామి-అత్తరు సెగలై విల విల నలిగిండే

:- ఆ శివయ్య మెడలో ఉన్న నాగేంద్రుడు, నాగాభరణాలు అని అంతం కదా. అవి, ఆ అమ్మవారి వలపుల ఎదురు చూపుల వేడి అయ్యోరికి తగిలే సరికి ఎగిరెగిరి పడ్తున్నాయి, ఇంకా ఆయన ఒంటికి రాసుకున్న విభూది కూడా జల జల రాలుతూ ఉంటె అయ్యోరు కదిలి వెళ్తున్నారంట... ఇంకా ఆలా పిలిచినా అమ్మ పిలుపుకి వాటినుండి వచ్చిన వలపుల వేడి సెగలు అత్తరులా ఆ విభూదితో కలిసి గుభాలిస్తున్నదంట స్వామి శరీరం. ఎంత అద్భుతంగ వర్ణించారు.

లాహే లాహే లాహే లాహే లాహే లాహే - లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే - నరదిన దినదిన నాననా-నరదిన దినదిన నాననా
కొరకొర కొరువులు మండే కళ్ళు - జడలిరబోసిన సింపిరి కురులు , ఎర్రటి కోపాలెగసిన కుంకంబొట్టు వెన్నెల కాసిందే - పెనిమిటి రాకను చూసి సీమాతంగి సిగ్గులు పూసిందే

:-- అప్పటివరకూ కొర కొర మండుతూ, విరబోసిన జుట్టుతో, ఎర్రటి కుంకుమ బొట్టుతో విరహ వేదనలో చిరు కోపంగా ఉన్న అమ్మవారు (సీ - శ్రీ మాతంగి అని కూడా పేరుంది) ఆయన రాకని చూస్తూనే సిగ్గుల మొగ్గై వెన్నెలలో విరబూసిన చల్లని పూల పరిమళంలాగ మారిపోయిందట ....

ఉబలాటంగా ముందటికురికి… అయ్యవతారం చూసిన కల్కి - ఎందా శంఖం సూళం భైరాగేసం ఏందని సణిగిందే - ఇంపుగ ఈ పూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే

:-_- అన్ని చూపులు, సింగారాలు సింగారించుకుని సిగ్గుతో పెనిమిటి రాకకోసం చూసిన అమ్మ , ఆయన వచ్చిన వెంటనే ఆరాటంగా ముందుకు వెళ్లి వచ్చిన అయ్యోరి గంభీరమైన (మొదటి చరణంలో రాసినట్టున్న ) అవతారం చూసి అలా ఉన్నపళంగా ఏ అలంకారాలు లేకుండా గంభీరంగా శంఖం - శూలం పట్టుకుని భైరాగిలా వచ్చేశావేంటి స్వామీ - ఈ పూటైనా కొంచం అందంగా తయారయ్యి రావచ్చు గదా అని కొంటెగా కసురుకుందట..

లాహే లాహే లాహే లాహే లాహే లాహే-లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే - లోకాలేలే ఎంతోడైన లోకువమడిసే సొంతింట్లోన-అమ్మోరు గడ్డంపట్టి బతిమాలినవి అడ్డాల నామాలు - ఆలు మగల నడుమన అడ్డం రావులే ఎట్టాంటి నీమాలు

:-- లోకాలనేలే వాళ్ళకైనా, అడ్డాల నామాలున్న శివుడికైనా ఇంట్లో భార్యని గడ్డం పట్టి బ్రతిమాలటం తప్పదు అని, స్త్రీ శక్తికి పెద్ద పీటవేసి ఆలుమగలు ఒక్కటవటానికి ఎటువంటి నియమాలు పెట్టుకోనవసరం లేదు, లేకుండా ఉండాలి అని లోకానికి చెప్తున్నారు. అలా ....

ఒకటో జామున కలిగిన విరహం-రెండో జాముకి ముదిరిన విరసం - సర్దుకుపోయే సరసం కుదిరే వేళకు-మూడో జామాయే - ఒద్దిక పెరిగే నాలుగో జాముకి-గుళ్లో గంటలు మొదలాయే

-- ఒకటో ఝాము (పూర్వు ఋషులు రోజుని 4 ఝాములుగ విభజించారు. వాటిలో ఒకటో ఝాము - సాయంకాలం సమయం) కి మొదలైన విరహం,రెండో ఝాముకి ముదిరి, అలకలు కులుకులు విసుర్లు తీరి దగ్గరవటానికి 3వ ఝాము వరకు సరిపోయిందని, అన్ని తీరిపోయి దగ్గరయ్యే సమయానికి భక్తులు గుళ్లో గంటలు మోగించి సుప్రభాత సమయం అయ్యింది అని ఇద్దరి సరస-విరహ సారాంశాన్ని ముగించి ఇంకా...

లాహే లాహే లాహే లాహే లాహే లాహే - లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే - లాహే లాహే లాహే లాహే లాహే లాహే - లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం-ఎడమొకమయ్యి ఏకం అవటం, అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం-స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం

--- ఇది అందరి ఇళ్లలోనూ ప్రతి రోజు జరిగే ఘట్టమేను, గొడవపడటం, మళ్లి ఏకమవ్వడం అనేదే అనుభూతి భార్య-భర్తల బంధంలో అని అనాది కాలం నుండీ అలవాటు ఉందని, అలాంటి అలకలలోనే, అవి ఒకరికొకరు తీర్చటంలోనే తియ్యదనమ్ ఉందని చెపుతున్నారు.

*** ఇక్కడే కొంచం విపరీతార్థం వచ్చేలా రాసారు శాస్త్రి గారు, తన కలాన్ని మొదటినుండి ఈ ఆశావహ దృక్పధంతో కొంచం అలకలు కులుకులు అంటూ కలిపేలా రాసిన పదాలు, మింగుడుపడనట్టు చివరిలో " అనుబంధాలు కడతేరే పాఠం " అంటూ విపరీతార్థంతో ముగించడం కొంచం ఆలోచించేలా ఉంది.. కడతేరడం అంటే ఆగిపోవడం అనే వ్యతిరేకార్థం వాడుకలో ఉంది. ఆ పదానికి సరిపోయేలా " అనుబంధాలు దరిచేర్చేపాఠం " అంటే సరిగ్గా సరిపోయేది అనిపించించింది. (లేక) ముక్తిని ప్రసాదిస్తాం అనే వ్యవహారంలో రావటానికైనా " ఇహ బంధాలు కడతేర్చే పాఠం" అన్నా కూడా ఓ రకమైన ఆశావహ ముగింపు ఉండేది. మరి శాస్త్రి గారు ఇలా రాసింది ఎందుకో ఆ కవి హృదయం ఆలోచించాలి.
అవ్యజ్ (శంకర్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Search This Blog